ఆదివారం, జూన్ 28, 2026

ఈ రోజు (జూన్ 28) పీవీ నరసింహారావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, భారత దేశ గతిని మార్చిన ఒక గొప్ప దార్శనికుడు మన తెలుగువాడు కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. భారత దేశ పరిపాలనా చరిత్రలో "ఆయనకు ముందు... ఆయన తర్వాత" అని ఒక స్పష్టమైన గీత గీసి, చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న అపర చాణక్యుడు పీవీ నరసింహారావు గారు. సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని తన అపారమైన మేధస్సుతో గట్టెక్కించిన ఆయన జీవితం, సాధించిన విజయాల గురించి ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం


బాల్యం: పీవీ గారు జూన్ 28, 1921న తెలంగాణలోని వరంగల్ జిల్లా (ప్రస్తుతం) లక్నేపల్లిలో జన్మించారు. ఆయనను కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన పి. రంగారావు, రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకోవడంతో అక్కడే పెరిగారు.


కుటుంబం: ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు.


విద్యాభ్యాసం: ఉస్మానియా విశ్వవిద్యాలయం, పుణేలోని ఫెర్గూసన్ కళాశాలలో చదువుకున్నారు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం (హిస్లాప్ కళాశాల) నుంచి న్యాయ శాస్త్రంలో (Law) పట్టా పొందారు.


బహుభాషా కోవిదుడు: పీవీ గారు 9 భారతీయ భాషలు, 8 విదేశీ భాషలతో కలుపుకుని మొత్తం 17 భాషలు అనర్గళంగా చదవగల, రాయగల, మాట్లాడగల గొప్ప సాహితీవేత్త. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసిద్ధ నవల 'వేయి పడగలు' ను హిందీలోకి 'సహస్ర ఫణ్' పేరిట అనువదించారు.


రాజకీయ ప్రస్థానం మరియు పదవులు


నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 'వందేమాతరం ఉద్యమం' ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. స్వామి రామానంద తీర్థ అనుచరుడిగా అజ్ఞాతంలో ఉంటూ నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు.


1957 1971 : శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలో న్యాయ, దేవాదాయ, వైద్య, విద్యా శాఖల మంత్రిగా పనిచేశారు.

1971 1973 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

1980 1989 : ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో విదేశీ వ్యవహారాలు, హోం, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి (HRD) వంటి అత్యున్నత శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.

1991 1996: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి, సంచలనాత్మక ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చారు.

 

ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలు (1971-1973)


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం తక్కువే అయినా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు:


భూసంస్కరణలు (Land Reforms): దేశంలోనే అత్యంత కఠినంగా 'భూ గరిష్ట పరిమితి చట్టాన్ని' (Land Ceiling Act) అమలు చేశారు. దీనివల్ల వేలాది ఎకరాల మిగులు భూమి పేదలకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు దక్కింది. స్వయంగా తన కుటుంబానికి చెందిన వందల ఎకరాల భూమిని సైతం ప్రభుత్వానికి అప్పగించిన ఆదర్శమూర్తి.


వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం: రాజకీయాల్లో కింది స్థాయి వర్గాలకు రిజర్వేషన్లు, తగిన ప్రాధాన్యం కల్పించారు. వెట్టి చాకిరీని రద్దు చేశారు.


విద్యారంగం: నివాస పాఠశాలల (Residential Schools) విధానానికి బీజం వేశారు. ఇదే ఆలోచన తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల స్థాపనకు స్ఫూర్తినిచ్చింది.


1991: ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశ పరిస్థితి


1991లో పీవీ గారు ప్రధాని అయ్యే నాటికి భారతదేశం చరిత్రలో కనీవినీ ఎరుగని అతి పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. కేవలం రెండు వారాల దిగుమతులకు సరిపడా విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలింది. అప్పులు కట్టలేక దేశం దివాలా తీసే అంచున నిలబడింది. దేశ పరువు నిలబెట్టేందుకు 47 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కుదవ పెట్టాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. మిత్రదేశమైన సోవియట్ యూనియన్ (రష్యా) విచ్ఛిన్నం కావడం, గల్ఫ్ యుద్ధం వల్ల చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.


ఆయన తీసుకున్న నిర్ణయాలు - దేశం మారిన స్థితి


ఈ క్లిష్ట సమయంలో ఎవరూ ఊహించని విధంగా, రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ను పీవీ ఆర్థిక మంత్రిని చేశారు.


లైసెన్స్ రాజ్ రద్దు: పరిశ్రమలు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతుల కోసం నెలల తరబడి తిరగాల్సిన దరిద్రపు 'లైసెన్స్ రాజ్' వ్యవస్థను రద్దు చేశారు.


LPG సంస్కరణలు: సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (Liberalization, Privatization, Globalization) విధానాలను ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడులకు (FDI) తలుపులు తెరిచారు.

దీని వల్ల మూతపడే స్థితికి వచ్చిన దేశ ఆర్థిక వ్యవస్థ, అనతికాలంలోనే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందింది.


విదేశీ విధానం (Look East Policy): పాకిస్తాన్, అమెరికాలకే పరిమితమైన మన విదేశీ విధానాన్ని ఆసియా దేశాల వైపు మళ్లించిన "తూర్పు వైపు చూడండి" (Look East Policy) సృష్టికర్త కూడా పీవీ గారే.


సంపన్నులకే పరిమితమైన సౌకర్యాలు సామాన్యుడి గడపకు


పీవీ గారి సంస్కరణల వల్ల జరిగిన అత్యంత అద్భుతమైన మార్పు ఇది. 1990వ దశకం వరకు ఒక కారు, టూ వీలర్ (బైక్/స్కూటర్), కలర్ టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ల్యాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్, కంప్యూటర్ల వంటివి కేవలం అతికొద్ది మంది సంపన్నులకు మాత్రమే పరిమితమైన విలాస వస్తువులు. ఒక ఫోన్ కనెక్షన్ లేదా బజాజ్ స్కూటర్ బుక్ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్ లో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది.


కానీ పీవీ గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల మార్కెట్ లోకి ప్రపంచ స్థాయి కంపెనీలు అడుగుపెట్టాయి. ఉత్పత్తి పెరిగింది, పోటీ పెరిగి ధరలు తగ్గాయి. దీని ఫలితంగా ఒకప్పుడు సంపన్నులకే సాధ్యమైన బైక్‌లు, కార్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, గృహోపకరణాలు నేడు పేద మరియు మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి.


ఉచితాలకు దూరం - ప్రజల చేతికి అన్నీ వచ్చేలా చేసిన వైనం


చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రత్యక్షంగా "అది ఇస్తాం, ఇది ఇస్తాం" అని చెబుతారు. కానీ పీవీ గారి దార్శనికత పూర్తి భిన్నమైనది. ఆయన ఏ వస్తువునూ ఉచితంగా ఇవ్వకుండానే, ప్రజల చేతికి అన్నీ వచ్చేలా చేశారు. ఆయన తెచ్చిన నిర్మాణాత్మక మార్పుల కారణంగానే దేశంలో సంపద సృష్టించబడింది, ప్రజల కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరిగింది. ప్రజలు తమ సొంత కృషితో తమకు కావాల్సినవన్నీ కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగే "అవకాశాలను" ఆయన సృష్టించారు.


ప్రభుత్వ ఉద్యోగమే దిక్కు అనే దశ నుండి అంతులేని అవకాశాల వైపు


పీవీ గారికి ముందు తరంలో యువతకు "ప్రభుత్వ ఉద్యోగమే దిక్కు" అనే భావన బలంగా ఉండేది. కానీ పీవీ తెచ్చిన సంస్కరణల వల్ల ఐటీ (IT), టెలికాం, ఫార్మా రంగాల్లో కోట్లాది ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అంతకన్నా మెరుగైనవని, స్వయం ఉపాధితో ఇంకా ఎత్తుకు ఎదగడానికి అవకాశం ఉందనే యువత ఆలోచనా ధోరణి మారడానికి, అపారమైన అవకాశాల సృష్టికి నేరుగా పీవీ గారి విధానాలే కారణం.


చివరిగా.. డిసెంబర్ 23, 2004 న పీవీ నరసింహారావు గారు కన్నుమూసినప్పటికీనేటికి ఆయన వేసిన బాటలోనే తదుపరి ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. పార్టీలు మారినా, నాయకులు మారినా భారత ఆర్థిక వ్యవస్థ నేడు నడుస్తున్నది పీవీ వేసిన పునాదుల పైనే. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదు, సంక్షోభంలో ఉన్న దేశాన్ని ప్రగతిపథంలోకి నడిపించడం అని నిరూపించిన మహనీయుడు పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు గారి దేశ సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 లో "భారత రత్న" ప్రకటించింది. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ.. ఇలాంటి ఒక దార్శనికుడు మన తెలుగు వాడు కావడం మనందరికీ ఎంతో గర్వకారణం.

  


సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి కుటుంబ పోషణ కొరకు ప్రభుత్వం జీవన భృతిని అందిస్తుంది. దీని నియమాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి:

1. ప్రాథమిక జీవన భృతి (FR 53(1)(ii)(a)):

  • ​సస్పెన్షన్ ప్రారంభమైన మొదటి రోజు నుండి ఉద్యోగి పొందుతున్న మూల వేతనం (Basic Pay) లో 50% (సగం) మొత్తాన్ని జీవన భృతిగా లెక్కిస్తారు.
  • ​ఈ సగం బేసిక్ పే ఆధారంగా ఆయా ప్రాంతాలకు వర్తించే కరువు భత్యం (DA) మరియు ఇంటి అద్దె భత్యం (HRA) లను కూడా కలిపి చెల్లిస్తారు.

2. మూడు నెలల తర్వాత సమీక్ష (FR 53(1)(ii)(a) - Proviso):

  • ​సస్పెన్షన్ కాలం 3 నెలలు (90 రోజులు) దాటిన తర్వాత ఉన్నతాధికారుల కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది.
  • జీవన భృతి పెంపు (75% వరకు): విచారణ ఆలస్యం కావడానికి ఉద్యోగి కారణం కానప్పుడు, జీవన భృతిని మూల వేతనంలో 75% వరకు పెంచవచ్చు.
  • జీవన భృతి తగ్గింపు (25% వరకు): విచారణ ఆలస్యానికి ఉద్యోగి ప్రవర్తనే కారణమైతే, జీవన భృతిని మూల వేతనంలో 25% వరకు తగ్గించవచ్చు.

3. జీవన భృతి నుండి మినహాయింపులు (Deductions):

  • ఖచ్చితంగా మినహాయించాల్సినవి (Compulsory): ఆదాయపు పన్ను (Income Tax), వృత్తి పన్ను (Professional Tax), APGLI/GIS ప్రీమియంలు, ప్రభుత్వ క్వార్టర్స్ అద్దె మరియు కోర్టు అటాచ్‌మెంట్ ఆర్డర్లు (ఇది జీవన భృతిలో 1/3 వంతు మించకూడదు).
  • అస్సలు మినహాయించకూడనివి (Forbidden): GPF లేదా CPS చందాలు (సస్పెన్షన్ కాలంలో వీటిని కట్ చేయకూడదు), అలాగే ప్రభుత్వానికి జరిగిన నష్టపరిహార రికవరీలు.
  • ఉద్యోగి అనుమతితో మినహాయించదగినవి (Optional): పండుగ అడ్వాన్సులు, ఇల్లు లేదా వాహన రుణాల రికవరీలు (HBA/MCA) మరియు ఎల్.ఐ.సి (LIC) ప్రీమియంలు.

4. ఉపాధి రహిత ధృవీకరణ పత్రం (Non-Employment Certificate):

  • ​జీవన భృతి ప్రతి నెల అందాలంటే ఉద్యోగి తప్పనిసరిగా తాము ఈ సస్పెన్షన్ కాలంలో ఎలాంటి ఇతర వ్యాపారాలు, ఉద్యోగాలు చేయడం లేదని "Non-Employment Certificate" ను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) కి సమర్పించాల్సి ఉంటుంది.

5. సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ (Regularisation):

  • ​విచారణ అనంతరం ఉద్యోగి నిర్దోషిగా తేలితే సస్పెన్షన్ కాలాన్ని "ఆన్ డ్యూటీ" (On Duty) గా మార్చి పూర్తి జీతాన్ని (ఇప్పటికే తీసుకున్న జీవన భృతిని మినహాయించి) చెల్లిస్తారు. దోషిగా తేలితే నిబంధనల ప్రకారం ఆ కాలాన్ని లీవ్ కింద సర్దుబాటు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీల్) నియమావళి, 1991 లేదా **AP CS (CCA) Rules, 1991 లోని రూల్ 8** అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ పరిస్థితులలో సస్పెన్షన్‌లో పెట్టవచ్చు, దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి అనే విషయాలను స్పష్టంగా వివరిస్తుంది.

దీని ప్రకారం ముఖ్యమైన అంశాలు కింద ఇవ్వబడ్డాయి:

1. సస్పెన్షన్ విధించే పరిస్థితులు (Rule 8(1))

ఒక ప్రభుత్వ ఉద్యోగిపై కింది సందర్భాలలో సస్పెన్షన్ వేటు వేయవచ్చు:

క్రమశిక్షణా చర్యలు (Disciplinary Proceedings): 

ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ (Inquiry) జరుగుతున్నప్పుడు లేదా విచారణ జరపాలని భావిస్తున్నప్పుడు (Contemplated or Pending).

రాష్ట్ర భద్రతకు భంగం:

సదరు ఉద్యోగి రాష్ట్ర భద్రతకు లేదా ప్రయోజనాలకు వ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటున్నారని సస్పెన్షన్ విధించే అధికారి భావిస్తే.

క్రిమినల్ కేసులు:

ఉద్యోగిపై ఏదైనా క్రిమినల్ నేరానికి సంబంధించి దర్యాప్తు (Investigation), విచారణ (Inquiry or Trial) నడుస్తున్నప్పుడు.

విధులు/కార్యాలయంతో సంబంధం లేకున్నా:

ఒక ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు లేదా క్రిమినల్ నేరం అతని ఆఫీసు విధులకు సంబంధించినవి కాకపోయినా కూడా (ఉదాహరణకు వ్యక్తిగత నేరాలు, నైతిక ప్రవర్తన లోపించడం వంటివి) అతనిని సస్పెండ్ చేయవచ్చు.

2. డీమ్డ్ సస్పెన్షన్ అంటే ఏమిటి? (Deemed Suspension - Rule 8(2))

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పై అధికారులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వకపోయినా, చట్టప్రకారం ఆ ఉద్యోగి సస్పెండ్ అయినట్లుగానే భావిస్తారు:
 
48 గంటల కస్టడీ:

ఏదైనా క్రిమినల్ కేసులో లేదా మరే ఇతర కారణం చేతనైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల కంటే ఎక్కువ సమయం పోలీస్ కస్టడీలో లేదా జైల్లో డిటెన్షన్ (బంధించబడి) ఉంటే, అతను అదుపులోకి తీసుకోబడిన తేదీ నుండి సస్పెండ్ అయినట్లుగా పరిగణిస్తారు.
 
కోర్టు తీర్పుల తర్వాత:

ఏదైనా కోర్టు శిక్ష కారణంగా ఉద్యోగిని డిస్మిస్ లేదా రిమూవ్ చేసినప్పుడు, తదుపరి అప్పీల్ లేదా ఉన్నత కోర్టు సాంకేతిక కారణాల వల్ల ఆ శిక్షను రద్దు చేసి, మళ్లీ విచారణ జరపాలని ఆదేశిస్తే, ఆ మధ్యంతర కాలంలో ఉద్యోగి పాత సస్పెన్షన్ లోనే కొనసాగుతున్నట్లు భావిస్తారు.

3. సస్పెన్షన్ ఎప్పుడు ముగుస్తుంది? (Revocation)
 
ఒకసారి విధించిన సస్పెన్షన్ ఆర్డర్, దానిని జారీ చేసిన అధికారి లేదా అతని కంటే పై అధికారి రద్దు (Modify or Revoke) చేసేంత వరకు అమల్లోనే ఉంటుంది.
 
ఒకవేళ ఉద్యోగిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసిన క్రిమినల్ కేసులు పూర్తిగా ముగిసిపోతే (Terminated), ఆ సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే నిలిచిపోతుంది.

కోర్టు ఆదేశాల ప్రకారం మరియు ప్రభుత్వ తాజా జీవోల ప్రకారం, ఒక ఉద్యోగిని చార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచకూడదు. సాధారణంగా ప్రతి 3 లేదా 6 నెలలకొకసారి ఉన్నతాధికారుల కమిటీ ఈ సస్పెన్షన్‌ను సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే సస్పెన్షన్ కాలంలో సదరు ఉద్యోగికి నియమ నిబంధనల ప్రకారం 

సస్పెన్షన్ కాలం లో జీవన భృతి (Subsistence Allowance) అందజేయడం తప్పనిసరి.


శనివారం, జూన్ 27, 2026

పచ్చని పారాణి పూసుకున్నట్లుండే దట్టమైన అటవీ ప్రాంతం... ఆ కొండల నడుమ వయ్యారంగా, గంభీరంగా ప్రవహించే గోదావరి, సీలేరు నదుల గలగలలు... మబ్బులను ముద్దాడే 'పాపికొండల' పచ్చని అందాలు... ఒకవైపు పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే 'మారేడుమిల్లి', మంచు దుప్పటి కప్పుకున్న 'గుడిసె' కొండల రమణీయత... మరోవైపు నవ్యాంధ్రకు జీవనాడి అయిన 'పోలవరం ప్రాజెక్టు', వెలుగులు పంచే 'డొంకరాయి', 'దిగువ సీలేరు' ప్రాజెక్టుల గంభీరత... రాజమండ్రి - విజయనగరం జాతీయ రహదారి వెంబడి ప్రయాణిస్తుంటే కనువిందు చేసే ఈ అపురూప దృశ్యాలన్నీ ఒక్కచోట చేరిన అద్భుత స్వప్నమే మన 'పోలవరం జిల్లా'. చారిత్రక దేవీపట్నం గుండా సాగే గోదావరి ప్రయాణంలో, ప్రకృతి ఒడిలో సేదదీరాలనుకునే ప్రతి మనసుకు ఈ నేల ఒక అందమైన స్వాగతం పలుకుతోంది.

At a Glance

నూతనంగా ఏర్పాటైన ఈ గిరిజన జిల్లాకు సంబంధించిన భౌగోళిక, పాలనాపరమైన ప్రాథమిక వివరాలు:

జిల్లా ప్రధాన కేంద్రం: రంపచోడవరం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను వేరుచేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరియు పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి. తో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.. ఈ జిల్లా జనాభా: 3,49,929.

భౌగోళిక అందాలు & పర్యాటకం

పోలవరం జిల్లా అంటేనే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే దట్టమైన అడవులకు, జలపాతాలకు కేరాఫ్ అడ్రస్.

పాపికొండలు & దేవీపట్నం: తూర్పు కనుమలను చీల్చుకుంటూ గోదావరి నది ప్రవహించే అద్భుత ఘట్టం పాపికొండలు. చారిత్రక దేవీపట్నం మీదుగా సాగే బోటు ప్రయాణం పర్యాటకులకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని ఇస్తుంది.

మారేడుమిల్లి ఎకో-టూరిజం: వెదురు అడవులు, ఔషధ మొక్కలు, జలపాతాలతో మారేడుమిల్లి రాష్ట్రంలోనే అత్యుత్తమ పర్యావరణ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడి గిరిజనులు వండే 'బాంబూ చికెన్' రుచి అమోఘం.

గుడిసె హిల్ స్టేషన్: దట్టమైన అడవి గుండా ప్రయాణించి చేరుకునే ఈ కొండల పైభాగం, ఉదయం పూట మంచు కప్పుకుని అచ్చం కాశ్మీర్‌ను తలపిస్తుంది. క్యాంపింగ్ చేయడానికి ఇది సరైన ప్రదేశం.

జలసిరులు - విద్యుత్ ప్రాజెక్టులు

గోదావరి, సీలేరు నదుల పరవళ్లు ఈ జిల్లాకు ప్రాణదాతలు. ఈ జిల్లా భౌగోళికత కేవలం పర్యాటకానికే కాకుండా, రాష్ట్ర ప్రగతికి కూడా కీలకమైనది.

పోలవరం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు, జీవనాడి అయిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ జిల్లాలోనే రూపుదిద్దుకుంటోంది. కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత నిర్మాణమిది.

సీలేరు బేసిన్ ప్రాజెక్టులు: కొండల పైనుండి ఉరకలేసే సీలేరు నదిపై నిర్మించిన డొంకరాయి మరియు దిగువ సీలేరు (Lower Sileru) జలవిద్యుత్ కేంద్రాలు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ జలాశయాల బ్యాక్ వాటర్ అందాలు కనువిందు చేస్తాయి.

రవాణా సౌకర్యాలు

గతంలో మారుమూలగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. దట్టమైన పచ్చని అడవుల గుండా, ఎత్తైన కొండల నడుమ వంకర్లు తిరుగుతూ వెళ్లే రాజమండ్రి - విజయనగరం జాతీయ రహదారి (NH) గుండా ప్రయాణిస్తుంటే, ప్రతి మలుపులోనూ ప్రకృతి ఒక కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. బైక్ రైడర్లకు, రోడ్ ట్రిప్ ఇష్టపడేవారికి ఈ మార్గం ఒక స్వర్గం.

పోలవరం జిల్లా... అటు రాష్ట్రానికి అన్నంపెట్టే ప్రాజెక్టులతో, ఇటు మనసుకు ప్రశాంతతను పంచే ప్రకృతితో తొణికిసలాడుతున్న ఒక అందమైన కాన్వాస్. ఎప్పటికైనా అన్వేషించాల్సిన, ఆస్వాదించాల్సిన ఒక అద్భుత ప్రపంచం!

 


మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts