శుక్రవారం, డిసెంబర్ 29, 2023

 ప్రతీ కార్యాలయానికి సమాచారం వివిధ రూపాల్లో అందుతూ ఉంటుంది. వివిధ అవసరాల కోసం ప్రజలు చేసే దరఖాస్తులు, కార్యాలయ అంతర్గత వ్యవహారాలు, వివిధ కార్యాలయాలు, శాఖల మధ్య వ్యవహారాలు, నివేదికలు మొదలైనవి. 


ఈ విధంగా వచ్చిన ప్రతీ సమాచారాన్ని కార్యాలయం లో వర్గీకరించి సంబంధిత సెక్షన్ లకు నిర్దేశింప బడిన రిజిస్టర్ (ఇన్వర్డ్ రిజిస్టర్)  లలో నమోదు చేసి (కరెంటు నంబరు జారీ చేసి) సెక్షన్ అధికారి మరియు సహాయకుల సంతకం పొందవలెను.  

సంబంధిత సెక్షన్ లలో వాటిని వారి యొక్క వ్యక్తిగత రిజిస్టర్ లలో నమోదు చేయవలెను. ఆ కరెంటు లు గతం లో ఉన్న ఫైళ్ళకు చెందినవి అయితే వాటి నందు ఉంచవలెను. లేకపోతె కొత్త ఫైల్ ఓపెన్ చేయవలెను. ఆ ఫైళ్ళ లోని సమాచారాన్ని అమలులో ఉన్న నిబంధనల మేరకు విశ్లేషించి తగు నిర్ణయం కొరకు మరియు ఆదేశాల కొరకు సంబంధిత అధికారులకు సమర్పించాలి. సంబంధిత అధికారులు వివరాలను పూర్తిగా పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. 

అధికారులు తీసుకున్న నిర్ణయాలను సంబంధిత వ్యక్తులకు లేదా కార్యాలయాలకు నిర్దేశింప బడిన ఫార్మాట్ నందు చేరవేయాలి.

చర్యలు పూర్తి అయిన ఫైళ్ళను భద్ర పరచుటకు రికార్డు రూమునకు పంపాలి.

భద్ర పరచ వలసిన సమయం పూర్తి అయిన ఫైళ్ళను నాశనం చెయ్యాలి. 

దస్త్రం (ఫైల్)

ప్రతీ ఫైల్ ప్రధానంగా నోట్ ఫైల్ మరియు కరెంట్ ఫైల్ అనే  రెండు భాగాలు కలిగి ఉంటుంది. 

నోట్ ఫైల్: 

కార్యాలయాల్లో వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి వివిధ స్థాయిల ఉద్యోగులు తమ అభిప్రాయాలను మరియు అధికారులను తన నిర్ణయాలను వ్యక్త పరచే ఫైల్ ని నోట్ ఫైల్ అంటారు. ఇది ప్రతీ కార్యాలయం లేదా శాఖ అంతర్గంగా నిర్వహిస్తారు. 

పేజీలపై నలుపు లేదా నీలం రంగు తో నంబర్లు వెయ్యాలి. 

నోట్ ఫైల్ లో ఎడమ వైపు మూడవ వంతు మార్జిన్ గా వదిలి వెయ్యాలి (అవసరమైన రిమార్కుల కొరకు) 

నోట్ ఫైల్ ప్రతీ పేజీ కుడిచేతి వైపు పైన ఫైల్ నంబరు తప్పని సరిగా రాయాలి. 

సబ్జెక్ట్ మరియు రెఫెరెన్సుల వివరములు నోట్ ఫైల్ మొదటి పేజీలోనూ మరియు అవసరమైన చోట రాయాలి.

పేరా నంబర్లు వెయ్యాలి (అధికారులు రాసే ఒక పదానికి సైతం పేరా నంబర్లు వెయ్యాలి.)

నోట్ ఫైల్ రాయడం లో మెళకువలు

  • మొదటగా ఫైల్ ఓపెన్ చేయడానికి కారణాలు తెలియపరచాలి. ఉదాహరణకు శ్రీ XXXXXXXXXXXXX వారు వారికి xxxxxxxxxx మంజూరు చేయవలసింది గా కోరియున్నారు.
  • తదుపరి సంబంధిత ఫైల్ కి సంబంధించిన నిబంధనలు ఇతర అంశములు క్లుప్తంగా వ్యక్త పరచాలి.
  • నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత ఫైల్ ఉన్న పరిస్థితులను విశ్లేషణ చేస్తూ ఆ వివరములను తెలియపరచాలి.
  • ఫైల్ లోని అంశాల ఆధారంగా తీసుకోగల అవకాశం ఉన్న నిర్ణయాలను తెలియ పరచ వచ్చు. ఇది వ్యక్త పరచడంలో నోట్ రాసే వారు కొంత విచక్షణ తో రాయాలి. 
    • కొన్ని ఫైళ్ల విషయం లో అధికారి తప్పని సరిగా ఒకే నిర్ణయం తీసుకోవడం తప్ప మరొక అవకాశం ఉండదు. ఉదాహరణకు కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే, బడ్జెట్ అందుబాటులో ఉంటె కట్టడం తప్ప మరొక అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భాలలో నేరుగా మంజూరు చేయవచ్చు అని అభిప్రాయం వ్యక్తపరచ వచ్చు. దాని తో పాటి డ్రాఫ్ట్ ప్రతి ఆమోదం కొరకు జత పరచ వచ్చు.
    • కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవడానికి బహుళ అవకాశాలు అధికారికి ఉండవచ్చు. ఆని రకాల అవకాశాలను తెలియ పరుస్తూ ఆదేశాల కొరకు నోటు ఫైల్ సమర్పించాలి.
    • మరి కొన్ని సందర్భాల్లో అధికారి తన విచక్షణాధికారాలతో ఏ నిర్ణయమైనా తీసుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు పరిస్థితులను వివరిస్తూ తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతూ ఫైల్ సమర్పించాలి.   
  • ఫైల్ కార్యాలయ ఉత్తర్వులకు (ఆఫీస్ ఆర్డర్స్) అనుగుణంగా సంబంధిత ఉద్యోగులు, అధికారుల ద్వారా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న అధికారి కి సమర్పించాలి. ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాలను నిబంధనల మేరకు స్వేచ్చగా వ్యక్త పరచవచ్చు.
  • నోట్ ఫైల్ లో వాస్తవాలను వ్యక్తపరచాలి. సాధ్యమైనంత సూక్ష్మంగా, విషయం సూటిగా అర్ధం అయ్యేలా ఉండాలి. సాధారణం గా పై స్థాయి అధికారులు ఫైల్ మొత్తం చదివి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. క్రింది సిబ్బంది రాసే నోట్ ఆధారంగా నే చాలా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 
  • క్రింది సిబ్బంది తప్పుడు సమాచారం లేదా అసమగ్ర సమాచారం లేదా తప్పు దోవ పట్టించే విధంగా నోట్ సమర్పించినపుడు దానికి అనుగుణంగా ఆదేశాలు, నిర్ణయాలు వెలువడితే దానికి అలాంటి నోట్ రాసిన వారు దానికి బాధ్యులు అవుతారు. 
  • అలాగే క్రింది సిబ్బంది ఏది రాసినా తుది నిర్ణయాధికారం సంబంధిత అధికారిదే. వారి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలి. నోట్ ఫైల్ లో అన్ని విషయాలు సరైన విధంగా నే సిబ్బంది తెలియపరచినా కూడా అధికారి తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఆ అధికారి బాధ్యత వహించ వలసి వస్తుంది. 
  • మనం నోట్ ఫైల్ సమర్పించగానే ఆదేశాలు జారీ అవ్వాలని  లేదు. అధికారులు అదనపు వివరాలు, సందేహాలు వ్యక్తపరుస్తూ వెనుకకు పంపవచ్చు. అలాంటి సందర్భాలలో అవసరమైన సమాచారం తిరిగి సమర్పించాలి. 
  • నోట్ రాసినపుడు అవసరమైతే కరెంటు ఫైల్ లేదా ఇతర రిఫరెన్సులను A, B, C, D ....... గుర్తిస్తూ ఫ్లాగ్స్ ఉంచాలి.
  • కొన్ని సార్లు ప్రస్తుత ఫైల్ పై నిర్ణయం తీసుకోవడానికి అదే రకమైన పాత ఫైల్ ని రిఫరెన్సు గా ఉంచవచ్చు. ప్రస్తుత ఫైల్ ని పైన ఉంచి పాత (రిఫరెన్స్) ఫైల్ ని అడుగున ఉంచాలి  
కరెంట్ ఫైల్ 

ఫైల్ కి సంబంధించి కార్యాలయానికి వచ్చిన ప్రతులు మరియు ఫైల్ నుండి కార్యాలయం నుండి జారీ చేసిన ప్రతులు, చిత్తు ప్రతులు కలిగి యుండే భాగాన్ని కరెంట్ ఫైల్ గా వ్యవహరిస్తారు.

కరెంట్ ఫైల్ నందలి ప్రతులను తేదీ ఆధారంగా అమర్చాలి (పాతవి పైన, కొత్తవి క్రింద ఉంచి ట్యాగ్ చెయ్యాలి)

పేజీలకు రెండు వైపులా ఎరుపు రంగుతో పేజీ నంబర్లు ఉండాలి.

డ్రాఫ్టు (చిత్తు ప్రతి) 
 
నోట్ ఫైల్ లో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణం గా జారీ చేయబోయే లేఖ, మేమో, ప్రొసీడింగ్స్ ..... యొక్క చిత్తు ప్రతి తయారు చేసి ఆమోదం కొరకు సమర్పించాలి.దీని లో ఈ క్రింద భాగాలు ప్రధానంగా ఉండాలి.

  • ఫైల్ నంబరు
  • పంపే వారి పూర్తి చిరునామా
  • పంపుతున్న వారి పూర్తి చిరునామా 
  • పంపే విధానం 
  • సర్/మేడం (అవసరమైతే)
  • సబ్జెక్ట్
  • రిఫరెన్సులు
  • ప్రధాన సారాంశం
  • తమ విధేయుడు/విదేయురాలు (అవసరమైతే)
  • సంతకం మరియు స్టాంప్ లేదా సీల్
  • జతపరచిన వివరములు ( ఏమైనా ఉన్నచో)
  • అర్జెంట్, అత్యవసరం వంటివి (అవసరమైతే)
వివిధ రకాల కమ్యూనికేషన్ విధానాలు

లెటర్:  దీనిని ఇతర అధికారులకు, ఉన్నతాధికారులకు పంపుటకు ఉపయోగిస్తారు.

మెమో: దీనిని తన క్రింద పని చేసే ఉద్యోగులకు లేదా కార్యాలయాల కు పంపుటకు ఉపయోగిస్తారు.

యు.వో.నోట్: ఒకే కార్యాలయం లోని వివిధ విభాగాలకు పంపుటకు ఉపయోగిస్తారు.

సర్కులర్ లేదా సర్కులర్ మేమో: తన క్రింద పనిచేసే కార్యాలయాలకు లేదా ఉద్యోగులు అందరికీ కలిపి జారీ చేసే సూచనలు ఈ రూపం లో పంపుతారు.

డి.వో.లెటర్: ఎవరైనా అధికారి ప్రత్యెక శ్రద్ధ వహించవలెనని కోరుటకు ఉపయోగిస్తారు. ఇది ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో సహా తన క్రింద పనిచేసే అధికారులకు కూడా ఉపయోగించవచ్చు. ఈ లేఖలకు సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వవలెను. ఒక వేళ ఆలస్యం అయ్యే సందర్భాలలో తప్పని సరిగా మధ్యంతర సమాధానం పంపవలెను.

ప్రొసీడింగ్స్: అధికారులు వారికి కలిగిన అధికారాలతో జారీ చేసే ఉత్తర్వులను ఈ రూపం లో ఇస్తారు.

ప్రెస్ నోట్ : పత్రికలలో ఇవ్వాల్సిన ప్రకటనలకు, వార్తలకు ప్రెస్ నోట్ ను ఉపయోగిస్తారు.

ఆఫీస్ ఆర్డర్: కార్యాలయ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేయుటకు ఉపయోగిస్తారు.

ఎండార్స్మెంట్: వచ్చిన కరెంట్ ని తిరిగి పంపించడానికి లేదా ఇతరుల నుండి వచ్చిన కరెంటులను యధాతధంగా ఇతరులకు కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తారు. 

ఇంకా మెయిల్, మెసేజ్, సోషల్ మీడియా వంటి వాటిని కూడా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. (వీటిని కూడా అంతర్గతంగా అధికారుల అనుమతి పొంది మాత్రమే జారీ చెయ్యాలి.) 

ఇవి కాకుండా సమావేశాలు, కార్య శాలలు, వీడియో మరియు టెలి కాన్ఫరెన్స్ లు, గ్రూప్ డిస్కషన్లు మొదలైనవి మౌఖిక రూపంలో జరిగే కమ్యూనికేషన్ విధానాలు. వీటికి తప్పని సరిగా మినిట్స్ జారీ చేయాలి.

ఫైల్ డిస్పోజల్  
 
ఒక ఫైల్ లోని అంశాలన్నీ పరిష్కరించబడి  ఇక తదుపరి చర్యలు ఏమీ అవసరం లేదని భావించినపుడు ఆ ఫైల్ ని డిస్పోజ్ చేసి రికార్డు రూము కి నియమిత కాలం భద్ర పరచుటకు పంపాలి. ఫైల్ డిస్పోజ్ చేసిన విధానాన్ని బట్టి భద్ర పరచవలసిన సమయం ఆధార పడి ఉంటుంది. 

ఆర్.డిస్: వీటిని శాశ్వతంగా భద్ర పరచాలి.
  
డి.డిస్: వీటిని సాధారణంగా 10 సంవత్సరాలు భద్రపరచాలి. తదుపరి సంబంధిత సెక్షన్ కు పంపి అవసరమైతే మరింత కాలం పొడగించ వచ్చు.
  
ఎల్.డిస్: వీటిని కనీసం ఒక సంవత్సరం భద్రపరచాలి. అవసరమైతే మూడు సంవత్సరాల వరకు పొడిగించ వచ్చు.

ఎన్.డిస్: వచ్చిన ప్రతిని తిరిగి వెనుకకు పంపుటకు

ఎఫ్.డిస్: ఎటువంటి చర్య తీసుకోకుండా ఫైల్ చేయుటకు

ఎక్స్.ఎల్.డిస్: కరెంట్ నంబరు కేటాయించకుండా ఫైల్ చేయుటకు

ఎక్స్.ఎన్.డిస్: కరెంటు నంబరు కేటాయించకుండా తిరిగి పంపుటకు

ఫైళ్ళను నాశనం చేయుట     

రికార్డు రూము నందలి ఫైళ్ళను వాటిని భద్ర పరచవలసిన సమయం పూర్తి అయిన తరువాత సంబంధిత సెక్షన్ పంపి మరింత కాలం భద్రపరచ వలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా అని అధికారుల నుండి అనుమతి పొందాలి. అవసరం లేదని ఆదేశించిన ఫైళ్ళను ధ్వసం చేయవలెను. 



ఈ నిబంధనలు హై కోర్ట్ జడ్జీలు, అఖిల భారత సర్విసుల ఉద్యోగులు, పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి,  విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కి, కంటింజెంట్ ఉద్యోగులకు మినహా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తాయి. 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉన్నతాధికారుల నుండి ఏమైనా ప్రత్యేకమైన ఆదేశాలు ఉంటె మినహా తన విధి నిర్వహణ లో తనకు సంక్రమించిన అధికారాలను నిబంధనలను అతిక్రమించి ఉపయోగించకూడదు.
  • ఉన్నతాధికారుల ఆదేశాలు కనుక నిబంధనల కు విరుద్ధంగా ఉన్నట్లయితే తప్పని సరిగా రాత పూర్వక మైన ఆదేశాలు పొందవలెను.
  • ఉన్నతాధికారులు రాత పూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల లోనూ తిరస్కరించ కూడదు.     

రూల్ - 3 A

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి భారత దేశ సార్వ భౌమత్వానికి, సమగ్రత కి భంగం కలిగించే ఎలాంటి సంఘం లోనూ సభ్యత్వం కలిగి ఉండకూడదు. 

రూల్ - 3 B

ఏ ఉద్యోగి తన విధి నిర్వహణ లో 
  • అమర్యాద పూర్వక ప్రవర్తన కలిగి ఉండకూడదు.
  • ఉద్దేశ్య పూర్వకంగా ఆలస్యం చేయ కూడదు.

రూల్ - 3 సి

  • ఏ ఉద్యోగి తన విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేయకూడదు. ఉద్దేశ్య పూర్వకంగా తాకడం, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించటం, అశ్లీల చిత్రాలు చూపడం, ఇతర ఇబ్బందికరమైన ప్రవర్తన కలిగి ఉండటం వంటివి చేయరాదు.

రూల్ - 3 (5)  

  • ఉన్నత స్థానం లో ఉన్న ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా తన క్రింద పని చేసే ప్రతీ ఉద్యోగి తన విధుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటానికి సాధ్యమైన చర్యలు చేపట్టాలి. ఎవరైనా ఉద్యోగి తరచుగా తనకు అప్పగించిన విధులు సకాలంలో పూర్తి చేయడం లో విఫలం అవుతూ ఉంటె అతనికి తన విధుల పట్ల శ్రద్ధ లేదని భావించాలి. 

రూల్ - 3 (6) 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా 14 లోపు ఉండే పిల్లల చేత ఎలాంటి పనులు చేయించుకోకూడదు.

రూల్ - 4 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి సమ్మెలు, లేదా  ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, నిరాహార దీక్షలు చేయటం, జీతం తీసుకోవడానికి నిరాకరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

రూల్ -5

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి దేశ సార్వభౌమత్వానికి లేదా సమగ్రతకు భాగం కలిగించే ఎలాంటి ధర్నాలలో పాల్గొన కూడదు 

రూల్ - 6

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరి నుండీ బహుమతులు, సేవలు పొందరాదు. ఉద్యోగి గౌరవార్ధం ఏర్పాటు చేసే ఎలాంటి సన్మానాలను, వినోద కార్యక్రమాలను అంగీకరించరాదు. ప్రైవేటు వ్యక్తుల అతిధి గృహాలలో నివసించడం, శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవలలో రిబ్బన్ కటింగ్ వంటివి చేయరాదు.  
  • అయితే పళ్ళు, పూలు వంటివి; కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో గ్రూప్  ఫోటో లు తీసుకోవడం, వివాహాల వంటి వేడుకలలో  బంధువుల నుండి  స్నేహితుల నుండి రూ.200 లోపు విలువైన బహుమతులను స్వీకరించవచ్చు.   
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబ సభ్యులు కానీ విదేశాల నుండి రూ.10,000 కన్నా విలువైన నగదు లేదా వస్తువులు అందుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియ పరచాలి. 

రూల్ - 7

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు ప్రభుత్వ అనుమతి ఉంటె తప్ప ఎటువంటి చందాలు వసూలు చేయకూడదు 

రూల్ - 8

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి వడ్డీకి  అప్పులు తీసుకోవడం కానీ చేయడం కానీ చేయకూడదు. 
  • బంధువుల వద్ద నుండి లేదా స్నేహుతుల నుండి స్వల్ప మొత్తం లో వడ్డీ లేని చేబదుళ్లు తీసుకోన వచ్చును.  బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు పొందవచ్చును.
  • వడ్డీకి అప్పులివ్వడం అనేది ఉద్యోగి యొక్క అవిభాజ్య హిందూ కుటుంబం యొక్క వారసత్వ వ్యాపారం అయినట్లయితే అది ఉద్యోగి పని చేసే జిల్లాలో లేనట్లయితే కొనసాగించ వచ్చును. అయితే ఈ వ్యాపార కార్యకలాపాలలో ఉద్యోగి పాల్గొన కూడదు.  
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి దివాలా తీసే పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు.

రూల్ - 9 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి మరియు అతని కుటుంబ సభ్యులు  ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి స్థిరాస్తులు లేదా లక్ష రూపాయలకు పైబడిన చరాస్తులు కొనుగోలు చేయటం, అమ్మడం చేయకూడదు. 
  • ఎవరి నుండి కొంటున్నారు? లేదా ఎవరికీ అమ్ముతున్నారు? కొనడానికి అవసరమైన ఆర్ధిక వనరుల వివరాలు తెలియ పరుస్తూ ముందస్తు అనుమతి పొందాలి.
  • అనుమతి కోసం దరఖాస్తు చేసిన నెల గడచినా కూడా అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగా భావించి కొనుగోళ్ళు, అమ్మకాలు చేయవచ్చు. 
  • ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వేలం పాటల్లో పాల్గొన కూడదు.
  • నాల్గవ తరగతి సిబ్బంది మరియు రికార్డ్ అసిస్టెంట్ లు మినహా మిగిలిన అందరు ఉద్యోగులు ఉద్యోగంలో చేరిన వెంటనే ఉద్యోగి పేరిట మరియు ఉద్యోగి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలు సమర్పించాలి. 
  • ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రతీ సంవత్సరం జనవరి 15 లోపు గత సంవత్సరంలో కొనుగోలు, అమ్మకాలు చేసిన, సంక్రమించిన స్థిర చరాస్తుల వివరాలు సమర్పించాలి. 

 రూల్ - 10 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. 
  • ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాపార కార్యకలాపాలు నిరహిస్తున్నట్లయితే ప్రభుత్వానికి తెలియ పరచాలి.
  • ప్రభుత్వ ఉద్యోగులు స్పెక్యులేషన్ తరహా పెట్టుబడులు పెట్టరాదు.

రూల్ - 11

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి కంపనీలు స్థాపించడం, భాగస్వామ్యం కావడం, నిర్వహించడం, ప్రమోట్ చేయడం చేయ కూడదు. 

రూల్ - 12

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ విధులు మినహా ప్రైవేటు ఉద్యోగం, లేదా ఇతర కార్యకలాపాల్లో ఉండకూడదు.  

రూల్ - 13 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా సాంకేతిక, సాహిత్య, కళాత్మక ధోరణి లేని ఎలాంటి పుస్తకాలు ప్రచురించ రాదు.

రూల్ - 14

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎటువంటి అధికారిక పత్రాలని, సమాచారాన్ని కానీ, సంబంధం లేని ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రెస్ కానీ అందజేయకూడదు.   
  • అయితే సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినపుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

రూల్ - 15

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ఏ ప్రెస్ కార్యకలాపాల్లో సంబంధం కలిగి ఉండకూడదు.  

రూల్ - 16

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన కూడదు. పత్రికల్లో ఆర్టికల్స్, పీరియడికల్స్ వంటివి ప్రచురించకూడదు.  

రూల్ - 17

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధానపర నిర్ణయాలను లేక చర్యలను విమర్శించ రాదు. 
  • అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉండే ప్రైవేట్ సమావేశాలు లేదా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో వారికి ఉద్యోగులకు సంబంధించిన అంశాల పై చర్చించవచ్చు.
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలకు గానీ కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర విదేశీ ప్రభుత్వ సంబంధాల కు ఇబ్బంది కలిగే విధమైన ప్రకటనలు చేయరాదు. 

రూల్ - 18

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ కమిటీ లేదా కమీషన్ ముందు కానీ సాక్ష్యం ఇవ్వరాదు.
  • కోర్టు విచారణలు మరియు శాఖ పరమైన విచారణ లలో సాక్ష్యం ఇవ్వవచ్చు.

రూల్ - 19

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీలలోనూ సభ్యత్వం కలిగి ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయటం కానీ వాటి కార్యకలాపాల్లో పాల్గొనటం కానీ చేయకూడదు.
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా రాజకీయ పార్టీ కార్య కలాపాలలో పాలు పంచుకోకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులను నిరోధించలేనిచో ప్రభుత్వానికి సమాచారమివ్వాలి.
  • ప్రభుత్వ ఉద్యోగి తనకు నచ్చిన విధంగా తన వోటు ని వినియోగించు కోవచ్చు. కానీ, ఎక్కడ బహిరంగ పరచకూడదు. 
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తనకు చెందినా వస్తువులు, ఇల్లు, వాహనాలు తనకు చెందిన ఏ ప్రదేశంలో ఏ ఎన్నికల గుర్తులు లేదా పార్టీ గుర్తులు ప్రదర్శించ కూడదు. 

రూల్ - 20

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు . మీడియా లో ప్రకటనలు ఇవ్వకూడదు 

రూల్ - 21

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు ఎవరైనా అ ఉద్యోగి క్రింద లేదా సహోద్యోగి గా పని చేయుచున్నట్లయితే ప్రభుత్వానికి తెలియ పరచాలి.
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే తన కుటుంబ సభ్యుల లేదా సమీప బంధువులైన అధికారుల క్రింద పని చేయ వలసి వస్తే యా విషయాన్నీ ప్రభుత్వానికి తెలియ పరచాలి. 

రూల్ - 22

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన తన కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ప్రభుత్వంతో కానీ, సంబంధిత శాఖతో కానీ, కార్యాలయం తో కానీ సంబంధం ఉన్న వ్యక్తులు లేదా సంస్థల లో ఉపాధి పొంద దలచినట్లయైతే  ప్రభుత్వానికి తెలియ పరచాలి.

రూల్ - 23

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక హోదాతో తన కుటుంబ సభ్యుల లేదా సమీప బంధువుల  వ్యవహారాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షం గా కానీ డీల్ చేయరాదు. 

రూల్ - 24

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అతని ప్రయోజనం  కోసం  పై అధికారులపై ఎలాంటి వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయరాదు. ప్రజా ప్రతినిధుల నుండి కానీ, నేరుగా అత్యున్నత స్థాయి అధికారుల నుండి కానీ సిఫార్సులు లేదా వత్తిడి తీసుకు రాకూడదు.
  • ఎలాంటి విజ్ఞాపన పత్రాలు తన తదుపరి స్థాయి అధికారి ద్వారా కాకుండా నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం లేదా లేఖలు రాయటం చేయరాదు. 

రూల్ - 25

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి జీవించి ఉన్న భార్య ఉండగా, భార్య అనుమతి లేకుండా మరో వివాహం చేసుకోకూడదు. 
  • ఏదేని పర్సనల్ లా బహు భార్యత్వానికి అవకాశం కల్పిస్తున్నా కూడా,  మొదటి భార్యతో విడాకులు పొంది లేదా తలాక్ చెప్పి మొదటి భార్యకు సమాచారం ఇచ్చిన తరువాత మాత్రమే రెండవ వివాహం చేసుకోవచ్చును.
  • వివాహం కాని, భర్త చనిపోయిన లేదా భర్తతో విడాకులు పొందిన ఏ మహిళా ఉద్యోగి కూడా భర్య బ్రతికి ఉన్న ఏ వ్యక్తిని అతని మొదటి భార్య అనుమతి పొందకుండా వివాహం చేసుకోరాదు.

రూల్ - 25 A

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కట్నం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయరాదు
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు ప్రత్యక్ష్యం గా కానీ, పరోక్షంగా కానీ కట్నం కొరకు వత్తిడి చేయకూడదు. 

రూల్ - 26

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణ లో ఉండగా మద్యం లేదా ఇతర మత్తు పదార్ధాలు (డ్రగ్స్) తీసుకోరాదు. మద్యం మత్తులో ఉండరాదు.
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం మత్తులో సంచరించరాదు.
  • మోతాదుకు మించిన మద్యం సేవించరాదు.   
 Annual property statement కోసం క్లిక్ చేయండి
(సూచన: సులభంగా అవగాహన కొరకు తెలుగులోకి సారాంశాన్ని తర్జుమా చేయడ మైనది. అసలు ప్రతిని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి)
 
 

గురువారం, డిసెంబర్ 28, 2023



G.O.Ms.No. 238 ఆర్ధిక శాఖ, తేదీ.13.08.1969 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లోని గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగులు, తమకు నిల్వ ఉన్న సంపాదిత సెలవు (Earned Leave) ని సరెందర్ చేసుకుని దానికి సమానమైన లీవ్ శాలరీ పొందే అవకాశం కల్పించ బడింది.తదుపరి నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా  ఈ అవకాశం కల్పించ బడింది. (సర్క్యులర్ మెమో నెం.52729-A/681/69-1, 11.10-1969 ఆర్ధిక శాఖ)

రాష్ట్ర ప్రభుత్వం లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇలా సరెండర్ చేయడం ద్వారా నగదు చెల్లించదు. (G.O.Ms.No. 211 ఆర్ధిక శాఖ, తేదీ.10.04.1972)

ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరెందర్ లీవ్ మాతృ శాఖ చెల్లించాలి. (ఫారిన్ ఎంప్లాయర్ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది)

ఎప్పుడు వినియోగించు కొనవచ్చును

  • 12 నెలల విరామంతో 15 రోజులు, 24 నెలల విరామం తో 30 రోజులు సరెండర్ చేసుకొన వచ్చును. 
  • తాత్కాలిక ఉద్యోగులు 24 నెలల విరామం తో 15 రోజులు  సరెండర్ చేసుకొన వచ్చును. (G.O.Ms.No. 211 ఆర్ధిక శాఖ, తేదీ.10.04.1972 & G.O.Ms.No. 316 ఆర్ధిక శాఖ, తేదీ.25.11.1974)
  • సంపాదిత సెలవు (Earned Leave) ఖాతాలో 285 ఎక్కువ సెలవులు ఉన్నవారు 12 నెలలు విరామం లేకుండానే ప్రతీ సంవత్సరం జూన్ 30 వ తేదీన సరెందర్ చేసుకొన వచ్చును. 
  • ఎటువంటి విరామం లేకుండా పదవీ విరమణ చేసి పునర్నియామకం పొందిన వారు కూడా సరెండర్ చేసుకొన వచ్చును.  (G.O.Ms.No. 324 ఆర్ధిక శాఖ, తేదీ.30.07.1976).

ఏ తేదీన సరెండర్ చేయాలి 

  • ఉద్యోగి దరఖాస్తు చేసిన తేదీ న సరెండర్ కు అనుమతించవచ్చు. పాత తేదీ తో సరెండర్  కు అనుమతించ రాదు (సర్క్యులర్ మెమో నెం.49395/19/FR-II/75-1, 06-01-1976 ఆర్ధిక శాఖ)
     

బేసిక్ పే తో పాటు అనుమతించబడిన అలవెన్సులు 

(సర్క్యులర్ మెమో నెం.52729-A/681/69-1, 11.10-1969 ఆర్ధిక శాఖ)

    • కరువు భత్యం (Dearness Allowance - D.A.)
    • ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.)
    • అదనపు ఇంటి అద్దె భత్యం (Addional H.R.A) - (G.O.Ms.No.25 ఆర్ధిక శాఖ Dt.05.02.1996)
    • Compensatory Allowances (CCA/SCA etc)
  • విధి నిర్వహణ కొరకు ఇచ్చే ఇతర అలవెన్సులు, మరియు స్పెషల్ పే లు, మధ్యంతర భ్రుతి చెల్లించ బడవు.
  • ఏ నెలలో సరెండర్ చేసినప్పటికీ సరెందర్ చేసిన సెలవు కు నగదు చెల్లించడానికి నెలకు 30 రోజులుగా పరిగణించి లెక్కించ వలెను. (G.O.Ms.No. 306 ఆర్ధిక శాఖ, తేదీ.08.11.1974)
  • ప్రభుత్వ క్వార్టర్స్ లో నివసిస్తూ ప్రతీ నెల జీతం  తో ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.) పొందని వారు కూడా  సరెండర్ చేసిన లీవ్ శాలరీ తో ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.) చెల్లించాలి.
  • సరెండర్ లీవ్ ఉత్తర్వుల కాల పరిమితి 90 రోజులు. ( 27/423/A2/FR-II/97-1, 18.08-1997 ఆర్ధిక శాఖ)
సందేహాలు & సమాధానాలు


10 వ వేతన సంఘ సిఫార్సుల మేరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు G.O.Ms.No.209 ఆర్ధిక (HR III) శాఖ, 21.11.2016 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ కల్పించ బడింది. 

ఎన్ని రోజులు ఏ విధంగా  పొందవచ్చు 

  • సర్వీసు మొత్తం లో మూడు నెలలు పొందవచ్చు. 
  • ఒక్కొక్క స్పెల్ లో గరిష్టంగా 15 రోజులకు మించకుండా వాడుకొనవచ్చును.
  • కనీసం ఆరు స్పెల్ల్స్ కు తగ్గకుండా వాడుకోవాలి.
  • చైల్డ్ కేర్ లీవ్ ని హక్కు గా పొందలేరు. తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందిన తదుపరి మాత్రమే ఉపయోగించుకొనవలెను.
  • క్యాజువల్ లీవ్ మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్ మినహా మిగిన అన్ని రకాల సెలవులకు కొనసాగింపు గా ఈ సెలవు ఉపయోగించు కొనవచ్చును.

 అర్హత

  • 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు. (పిల్లలు విభిన్న ప్రతిభావంతులు అయినచో 22 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించు కోవచ్చు)
  • పిల్లలు సదరు ఉద్యోగి పై ఆధార పడి ఉద్యోగితోపాటు నివసిస్తూ ఉండాలి. 
  • ప్రొబేషన్ లో ఉన్నవారు కూడా ఈ సెలవు పొందుటకు అర్హులు. ప్రొబేషన్ లో ఉండగా ఈ సెలవు ఉపయోగించుకొనడం వల్ల ప్రొబేషన్ పొడిగింప బడుతుంది . 

దేని కొరకు ఉపయోగించి కొనవచ్చును

  • పిల్లల పరీక్షలు, అనారోగ్య కారణాలు, వారి సంరక్షణ కొరకు ఏ అవసరాలకు అయినా సరే ఉపయోగించుకొన వచ్చును.

ఇతర నిబంధనలు

  • ఈ సెలవు కాలంలో లీవ్ ట్రావెల్  కన్సిషన్ ఉపయోగించు కోకూడదు.
  • ఉద్యోగి కి ఈ సెలవు మంజూరు చేయడం వల్ల కార్యాలయం ద్వారా నిర్వహించ బడే ప్రభుత్వ కార్యకలాపాల పై ప్రభావం లేకుండా కార్యాలయ అధికారి జాగ్రత్త వహించ వలెను. 
  • ఉద్యోగి సెలవు లోకి వెళ్లక ముందు పొందిన పే ఆధారంగానే చైల్డ్ కేర్ లీవ్ కాలంలో జీతం చెల్లించ వలెను. 

సెలవు ఖాతా నిల్వహించవలసిన విధానం.

ఈ దిగువ తెలిపిన ప్రోఫోర్మా నందు ఉద్యోగి యొక్క సర్వీసు రిజిస్టర్ నందు ఈ సెలవు ఖాతా నిర్వహించ వలెను. 

Period of Child Care Leave Taken

Balance of Child Care Leave

Signature and Designation of Certifying Officer

 From

To

Balance

Date

(1)

(2)

(3)

(4)

(5)

  

 

 

 

 

  

 

 

 

 

ఈ సెలవును ఉద్యోగి యొక్క చైల్డ్ కేర్ సెలవు ఖాతాలో మాత్రమే తగ్గించవలెను.రెగ్యులర్ లీవ్ ఎకౌంటుతో కలపకూడదు. 

సూచన:-

చైల్డ్ కేర్ సెలవు వాడుకోవడానికి ముందుగా ఉద్యోగి  కుటుంబ సభ్యులను డిక్లేర్ చేస్తూ సర్వీసు రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయంచుకొన వలెను. (Family Members Declaration Form )

 


ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మరియు 10 వ వేతన సంఘ సిఫార్సుల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు G.O.Ms.No.132 ఆర్ధిక (HR IV-FR) శాఖ, 06.07.2016 ద్వారా చైల్డ్ కేర్ లీవ్ కల్పించ బడింది. 

ఎన్ని రోజులు ఏ విధంగా  పొందవచ్చు 

  • సర్వీసు మొత్తం లో 180 రోజులు పొందవచ్చు. (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
  • కనీసం మూడు స్పెల్ల్స్ కు తగ్గకుండా వాడుకోవాలి.
  • గరిష్టంగా 10 స్పెల్ల్స్ కు మించకుండా వాడుకోవాలి. (G.O.Ms.No.199 ఆర్ధిక (HR IV & LR) శాఖ, 19.10.2022).
  • చైల్డ్ కేర్ లీవ్ ని హక్కు గా పొందలేరు. తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందిన తదుపరి మాత్రమే ఉపయోగించుకొనవలెను.
  • క్యాజువల్ లీవ్ మరియు స్పెషల్ క్యాజువల్ లీవ్ మినహా మిగిన అన్ని రకాల సెలవులకు కొనసాగింపు గా ఈ సెలవు ఉపయోగించు కొనవచ్చును.
  • సంపాదిత సెలవు మంజూరు చేయు అధికారం ఉన్న వారు దీనిని మంజూరు చేయవచ్చును.

అర్హులు

  • 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు. (పిల్లలు విభిన్న ప్రతిభావంతులు అయినచో 22 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించు కోవచ్చు)
  • పిల్లలు సదరు ఉద్యోగి పై ఆధార పడి ఉండాలి.
  • పురుష ఉద్యోగులు సింగిల్ పేరెంట్స్ అయినచో (వివాహం కాని వారు, విడాకులు తీసుకున్న వారు, భార్య చనిపోయిన వారు). (G.O.Ms.No.33 ఆర్ధిక (HR IV FR & LR) శాఖ, 08.03.2022.)
  • ప్రొబేషన్ లో ఉన్నవారు కూడా ఈ సెలవు పొందుటకు అర్హులు. ప్రొబేషన్ లో ఉండగా ఈ సెలవు ఉపయోగించుకొనడం వల్ల ప్రొబేషన్ పొడిగింప బడుతుంది .

దేని కొరకు ఉపయోగించి కొనవచ్చును

  • పిల్లల చదువు, అనారోగ్య కారణాలు, వారి సంరక్షణ కొరకు ఏ అవసరాలకు అయినా సరే ఉపయోగించుకొన వచ్చును. 

సెలవు ఖాతా నిల్వహించవలసిన విధానం.

ఈ దిగువ తెలిపిన ప్రోఫోర్మా నందు ఉద్యోగి యొక్క సర్వీసు రిజిస్టర్ నందు ఈ సెలవు ఖాతా నిర్వహించ వలెను. 

Period of Child Care Leave Taken

Balance of Child Care Leave

Signature and Designation of Certifying Officer

 From

To

Balance

Date

(1)

(2)

(3)

(4)

(5)

  

 

 

 

 

  

 

 

 

 

ఈ సెలవును ఉద్యోగి యొక్క చైల్డ్ కేర్ సెలవు ఖాతాలో మాత్రమే తగ్గించవలెను. సంపాదిత సెలవు (EL) లేదా అర్ధ వేతన సెలవు ఖాతాలో తగ్గించ కూడదు

ఇతర నిబంధనలు

  • ఈ సెలవు కాలంలో లీవ్ ట్రావెల్  కన్సిషన్ ఉపయోగించు కోకూడదు.
  • ఉద్యోగి కి ఈ సెలవు మంజూరు చేయడం వల్ల కార్యాలయం ద్వారా నిర్వహించ బడే ప్రభుత్వ కార్యకలాపాల పై ప్రభావం లేకుండా కార్యాలయ అధికారి జాగ్రత్త వహించ వలెను. 
 
సూచన:-

చైల్డ్ కేర్ సెలవు వాడుకోవడానికి ముందుగా ఉద్యోగి  కుటుంబ సభ్యులను డిక్లేర్ చేస్తూ సర్వీసు రిజిస్టర్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయంచుకొన వలెను. (Family Members Declaration Form )

శుక్రవారం, డిసెంబర్ 01, 2023

దివ్యాంగులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు సంవత్సరానికి గరిష్టంగా 7 రోజులు ఉంటుంది. వైకల్యం, అభివృద్ధికి సంబంధించిన సమావేశాలు, సెమినార్లు, శిక్షణలు, వర్క్‌షాప్‌లు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ సెలవు ఉపయోగపడుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి సెలవులను మంజూరు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (APSJSC) సమావేశంలో ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

7 రోజుల కంటే ఎక్కువ సెలవు కావాలంటే, అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సాధారణ సెలవును సాధారణ సెలవులతో కలిపి తీసుకోవడానికి కూడా అనుమతి ఉంది. సంబంధిత సెలవు మంజూరు చేసే అధికారి ఈ సెలవును మంజూరు చేస్తారు. ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


జివో కొరకు క్లిక్ చేయండి



మొత్తం పేజీ వీక్షణలు

WEBSITES

Recent Posts

Popular Posts